సీఎం రేవంత్ రెడ్డి రోల్ మోడల్..

సీఎం రేవంత్ రెడ్డి రోల్ మోడల్..
- ప్రజా పాలనలో గుణాత్మకమైన మార్పు
- బిజెపి వ్యాపారస్తుల పార్టీ రెండున్నర సంవత్సరాలలో
- సంక్షేమ కార్యక్రమాలు
- సామాజిక న్యాయం ప్రజాస్వామ్యం లక్ష్యం
- నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి
నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశంలో పాలన పరంగా ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు.
మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయ కార్యక్రమాలపై ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాలంలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. కులగణన కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా సూచించిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 100 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతమైన అమలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ప్రతి వ్యక్తి అభివృద్ధికి విద్యే ప్రధాన మార్గమని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ఈ నెల 4, 5 తేదీలలో ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాకు రానున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన మల్లు రవి, బీజేపీ వ్యాపారవేత్తల పార్టీగా మారిందని ఆరోపించారు. పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు అందిస్తున్నామని చెప్పడం సరైనది కాదని, రాష్ట్రం కేంద్రానికి చెల్లిస్తున్న నిధులతో పోల్చితే ఎంత మేర తిరిగి కేటాయిస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
భారతదేశం సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశమని, అన్ని రాష్ట్రాలకు సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయ పార్టీలు వేర్వేరు అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రిని పలుమార్లు కలిసి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, విద్యుత్ సబ్సిడీలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, తాగునీటి సౌకర్యాల కల్పన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.
ఈ సమావేశంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, వైస్ చైర్మన్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కౌన్సిలర్లు శంకర్, నిజాం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్, పట్టణ అధ్యక్షుడు జక్కా రాజు, రాము, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
