‘నా భవనం కూల్చేశారు.. న్యాయం చేయండి’
విజయవాడ, ఆంధ్రప్రభ : పెనమలూరు మండలం గంగూరులో తాను చట్టబద్ధంగా డెవలప్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుని నిర్మించిన భవనాన్ని కొందరు అక్రమంగా కూల్చివేశారని సీనియర్ స్ట్రక్చరల్ ఇంజనీర్ షేక్ షకీల్ ఆరోపించారు. ఈ ఘటనపై పలుమార్లు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా సివిల్ వివాదంగా పరిగణిస్తున్నారని గురువారం విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
భవన నిర్మాణానికి భారీగా పెట్టుబడి పెట్టానని, కోర్టు గతంలో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా భవనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
