న్యాయం కోసం ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలం లోని ఏ.కె. తండాకు చెందిన 21 ఏళ్ల గిరిజన యువతి అనుమానాస్పద మృతిపై బాధిత కుటుంబం తరపున గుగులోతు పుల్యా ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాష్ట్ర ఎస్టీ సంఘం ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్ తో కలిసి సోమవారం హైదరాబాద్ లో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్ 2న జరిగిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నిష్పక్షపాత విచారణ జరిపించాలని, కేసును ఉన్నతాధికారికి బదిలీ చేయాలని, బాధిత కుటుంబానికి, సాక్షులకు రక్షణ కల్పించాలని, నష్టపరిహారం అందించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలోతు వసుంధర్ బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
