తల్లిపాలే శిశువుకు అమృతం..

  • తొలి ఆరు నెలలు ముఖ్యం..
  • ముర్రుపాలు శిశువుకు తొలి రోగనిరోధక కవచం
  • డీఎంహెచ్‌వో డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు
  • తల్లిపాలతో శిశువు ఎదుగుదలతో పాటు తల్లికీ ఆరోగ్య రక్షణ

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం పాత ప్రభుత్వాసుపత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు మాట్లాడుతూ, పుట్టిన శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాతే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలని సూచించారు. ఉద్యోగినులు కూడా వీలైనంత వరకు తల్లిపాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

శిశువుకు పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) అత్యంత విలువైనవని, వాటిలో సమృద్ధిగా ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తి శిశువును అనేక అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారంతో పాటు సమతుల్య పోషకాహారం తప్పనిసరిగా అందించాలని సూచించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువు శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడటమే కాకుండా తల్లి–బిడ్డల మధ్య ఆప్యాయత మరింత బలపడుతుందని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. తల్లిపాలు శిశువు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల బాలింతల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని, తల్లిపాలు ఎలాంటి ఖర్చు లేకుండా సహజంగా లభించే అత్యుత్తమ ఆహారమని వివరించారు. ప్రతి తల్లికి పాలిచ్చే విధానం, పాలిచ్చే ముందు స్తనాల పరిశుభ్రత, శిశువును సరైన రీతిలో పాలిచ్చే పద్ధతులపై ఆరోగ్య సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డాక్టర్ శ్రావణ్ బాబు ఆదేశించారు. సరైన తల్లిపాల ద్వారా శిశువు ఆరోగ్యం, పెరుగుదల సక్రమంగా ఉండేలా ప్రతి కుటుంబం చైతన్యవంతం కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శరత్ బాబు, ఆర్‌ఎంఓ డాక్టర్ ఝాన్సీ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి. అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.