కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్

ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల వసతి సౌకర్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు దేవస్థానం అధికారులు, పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆర్చ్, అతిథి గృహం పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజూ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, వారికి కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల వసతి, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, నాయబ్ తహసీల్దార్ అబ్దుల్ రజాక్, ఆలయ పూజారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.