ఎమ్మెల్యే గండ్రపై వ్యక్తిగత విమర్శలు మానాలి: కాంగ్రెస్

బీఆర్ఎస్ నేతలు హద్దులు దాటితే రాజకీయంగా సమాధానం తప్పదని హెచ్చరిక

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, కాంగ్రెస్ నాయకుడు దాట్ల శ్రీనివాస్ తెలిపారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భూపాలపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల విస్తరణ, వైద్యుల నియామకం, ప్రజలకు మెరుగైన వైద్య సేవల కల్పన కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.

మైనార్టీ పాఠశాలల సమస్యలను గుర్తించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ దిశగా పనిచేస్తున్న నాయకులపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీ పాఠశాలలను అద్దె భవనాల్లో నిర్వహించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలను ప్రభుత్వ భవనంలోకి మార్చి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తోందని చెప్పారు.

గత పాలనలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసని, రాజకీయ విమర్శలు హద్దులు దాటకుండా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు, అవాకులు–చవాకులు కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా గట్టిగా స్పందిస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.