రేపు జనగామ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి రాక
రేపు జనగామ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి రాక
– భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
చిల్పూర్, ఆంధ్రప్రభ:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 9వ తేదీన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో సభా స్థలాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా సుమారు 60.62 కోట్ల రూపాయల విలువైన 7 విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్నాయి. దీనిలో భాగంగా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 6 వేల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సభా ప్రాంగణంలో, వేదికపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మొదటిసారి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు. నియోజకవర్గంలోని పీచర, కొండాపూర్, సాగరం, కుర్చపల్లి గ్రామాలలో సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, అలాగే లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాలలో శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా 33/11 కేవీ, 132/33 కేవీ సర్వీస్ లైన్ల షిఫ్టింగ్ సమస్యలను పరిష్కరించాలని, రఘునాథపల్లి సబ్ స్టేషన్ను 220/132 కేవీగా అప్గ్రేడ్ చేయాలని మంత్రిని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో నియోజకవర్గంలో దాదాపు 90 శాతం విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
