CISF | శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కు బెదిరింపు మెసేజ్‌

CISF | శంషాబాద్ ఎయిర్​పోర్ట్​కు బెదిరింపు మెసేజ్‌

CISF | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మే 24న బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న KLM-873 అంతర్జాతీయ విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ పంపడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

విమానాశ్రయ అధికారులకు వచ్చిన మెయిల్‌లో “విమానం ల్యాండ్ అయ్యేలోపు ఎప్పుడైనా బాంబు పేలొచ్చు” అని హెచ్చరిక ఉండటంతో వెంటనే అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు. CISF సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, శంషాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రన్‌వే పరిసరాల్లో అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య KLM-873 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక పరికరాలు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో విమానం, కార్గో విభాగం, లగేజీని పూర్తిగా తనిఖీ చేసింది.

గంటల పాటు సాగిన తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఇది ఫేక్ లేదా హోక్స్ బెదిరింపు మెయిల్ అని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కొంతసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెయిల్ ఎక్కడి నుంచి పంపారు? ఎవరు పంపారు? అనే కోణాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయానికి వరుసగా ఇలాంటి హోక్స్ బాంబు బెదిరింపులు రావడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.

Leave a Reply