MMTS Rape Case | అత్యాచారయ‌త్నం కాదంటే కాదు… రీల్ తీస్తూ ….

హైదరాబాద్‌ లోని ఎంఎంటిఎస్ ట్రైన్‌లో అత్యాచారయత్నం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. ట్రైన్‌ లో యువతి పై జరిగినదన్న అత్యాచారం అబద్ధంగా తేలింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేస్తూ ట్రైన్‌ లోనుండి జారిపడిన యువతి, అనంతరం తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లింది. ఆమె కథనాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అనుమానితులుగా 100 మందిని పోలీసులు విచారించగా, అసలు విషయానికి దగ్గరయ్యారు.

కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ని పరిశీలించారు. అనేక కోణాల్లో వీడియోలను అధ్యయనం చేసిన అనంతరం, యువతి కథనాల్లో అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. ఎటువంటి ఆధారాలు ఆమె చెప్పిన కథనాలను సమర్థించలేదని పోలీసులు తేల్చారు. విచారణలో చివరికి యువతి అసలు విషయం వెల్లడించింది. రీల్స్ చేస్తూ ట్రైన్‌ నుంచి జారిపడిన విషయాన్ని దాచిపెట్టి, అత్యాచారం జరిగినట్టు అబద్ధం చెప్పినట్టు ఒప్పుకుంది. పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని, ఎటువంటి అత్యాచారం జరగలేదని నిర్ధారించి కేసును మూసివేశారు.

Leave a Reply