గురుపౌర్ణమి సందర్భంగా గురువులకు ఘన నివాళి
చిట్యాల, ఆంధ్రప్రభ: గురుపౌర్ణమి సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఉరుమడ్ల బీసీ హాస్టల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ప్రత్యేక హ్యాపీనెస్ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీకి హాస్టల్ వార్డెన్ ప్రసాద్, విద్యార్థులు కలిసి ఘనంగా గురుపూజ నిర్వహించారు.
హ్యాపీనెస్ కోర్సులో భాగంగా విద్యార్థులకు యోగా ఆసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, భస్త్రిక, ఉజ్జయి శ్వాస, శ్వాస వ్యాయామాలు, ధ్యాన పద్ధతులను బోధించారు. పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువుల పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలని అన్నారు. ధ్యానం, జ్ఞానం, సేవతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, “ఒకే ప్రపంచం–ఒకే కుటుంబం” అనే భావనతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
వేదాలను విభజించిన వేదవ్యాస మహర్షిని స్మరించుకుంటూ వ్యాసపౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు. సకల విద్యలను శిష్యులకు అందించిన గురువులందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రసాద్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్లు పల్లపు రాకేష్, నరేష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
