తాడూరులో నూతన తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన

ప్రతిపాదనలు వెంటనే పంపించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశం

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తాడూరు మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని సర్వే నంబర్ 644లో ఉన్న ఒక ఎకరం ప్రభుత్వ భూమిని సందర్శించి, కార్యాలయ నిర్మాణానికి అనుకూలత, రవాణా సౌకర్యం, భవిష్యత్ విస్తరణ అవకాశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పరిపాలనా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే ఆధునిక వసతులతో కూడిన నూతన తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాడూరు మండల ప్రజలకు అన్ని రెవెన్యూ సేవలు ఒకేచోట సౌకర్యవంతమైన వాతావరణంలో అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.

నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ అమలుపై తహసీల్దార్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల జాబితాల డిజిటలైజేషన్ ప్రక్రియ మండలంలో వంద శాతం పూర్తయిందని తహసీల్దార్ వివరించారు. సంబంధిత రికార్డులను పరిశీలించిన కలెక్టర్, నిర్దేశిత గడువులోపు మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం తాడూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందిస్తూ నిర్మాణాలు ఎక్కడా నిలిచిపోకుండా పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాడూరు తహసీల్దార్, ఎంపీడీవో, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.