వీవీజీ–రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
కేసముద్రం, ఆంధ్రప్రభ: వీవీజీ–రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ మండల కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో క్రాంతికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోడిశాల వెంకన్న, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు నీరుటి జలంధర్ మాట్లాడుతూ.. కరువులు, వలసల నివారణ కోసం దశాబ్దాల పోరాటం ఫలితంగా 2005లో యూపీఏ–1 ప్రభుత్వం వామపక్ష పార్టీల మద్దతుతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. గత 20 ఏళ్లుగా ఈ చట్టం అనేక ఆర్థిక సంక్షోభాల నుంచి గ్రామీణ ప్రజలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.
అయితే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీవీజీ–రామ్‌జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి జూలై 1 నుంచి అమలు చేస్తోందని ఆరోపించారు. గతంలో ఉపాధి హామీ పథకంలో 90 శాతం నిధులను కేంద్రం, 10 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించేదని, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి రావడం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని విమర్శించారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, వీవీజీ–రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 రోజుల ఉపాధి కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని, ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని, పనిస్థలాల్లో టెంట్లు, మెడికల్ కిట్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, పనిముట్లను కార్మికులకు అందించాలని, చేసిన పనికి 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు జాన్పాటి జ్యోతి, నాయకులు మాదా శ్రీనివాస్, తులసిమొగ్గ వెంకన్న, బుద్ధారపు నాగరాజు, పొన్నాల జ్యోతి, మేకల నాగమణి, మాయ అనూష, ఏదుల కల్పన, మేకల భద్రమ్మ, పెద్ద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
