నెలాఖరులోపు జనగణన పూర్తి చేయాలి..

నెలాఖరులోపు జనగణన పూర్తి చేయాలి..

ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి : కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.

బుధవారం కలెక్టరేట్‌లోని ఛాంబర్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్‌తో కలిసి టెలికాన్ఫరెన్స్ ద్వారా జనగణన పురోగతిని ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 89.4 శాతం గణన పూర్తయిందని తెలిపారు.

శాంతిపురం, నగరి మున్సిపాలిటీ, పలమనేరు, పాలసముద్రం, రామకుప్పం, కుప్పం మున్సిపాలిటీ, వి.కోట, ఎస్.ఆర్.పురం, కార్వేటినగరం వంటి ప్రాంతాల్లో పనితీరు తక్కువగా ఉందని గుర్తించి, అక్కడ ప్రత్యేక చర్యలతో వేగవంతం చేయాలని ఆదేశించారు.

కొన్ని మండలాలు 2011 జనాభా లెక్కల స్థాయిని కూడా చేరుకోలేదని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనన–మరణాల రేటు ప్రకారం జనాభా పెరగాల్సి ఉండగా తగ్గుదల కనిపించడం గమనార్హమన్నారు. ప్రతి ఇంటిని మరోసారి పరిశీలించి ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని సూచించారు.

ఖాళీ ఇళ్లు, వలసలు వెళ్లిన కుటుంబాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, తహసీల్దార్లు తమ లాగిన్‌లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎన్యూమరేటర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతుల ప్రణాళిక, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో ఆర్డీఓలు, డీఎల్‌డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఏఎస్‌ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.