Child Road Safety | ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు చూడాలి!
పిల్లల రోడ్డు భద్రతపై సజ్జనార్ పోస్ట్..
Child Road Safety |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒక చిన్న నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఒక్క క్షణం ఏమరపాటు వారు కుటుంబాలకు జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తన అధికారిక ‘X’ ఖాతాలో మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. చిన్నారుల రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ నేపథ్యంలో చిన్నారుల రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పిల్లలకు చిన్న వయసు నుంచే రోడ్డు నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.
చిన్నారి ప్రాణం – మన బాధ్యత..
పాఠశాలల సమీపంలో స్కూల్ బస్సులు ఆగి ఉన్న ప్రాంతాల్లో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, వేగాన్ని ఖచ్చితంగా తగ్గించాలని సూచించారు. బస్సుల ముందు లేదా వెనుక భాగాల నుండి పిల్లలు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నందున, కొద్ది సెకన్ల ఓపికతో వాహనాలు నడపాలని కోరారు. క్షణ కాలపు తొందరపాటు ఎన్నో కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపుతుందని, ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని గుర్తు చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు అందరిని ఆలోచింపజేసేలా చేస్తోంది.
