Narendra Modi | ప్రధాని మోడీకి ఇండోనేషియా అత్యున్నత గౌరవం..
‘బింటాంగ్ ఆదిపూర్ణ’ అవార్డుతో సత్కారం
Narendra Modi |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ అవార్డును ప్రధాని మోడీకి ప్రదానం చేసింది. జకార్తాలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేశారు.
భారత్–ఇండోనేషియా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ పోషించిన పాత్రకు గుర్తింపుగానే ఈ అవార్డును ప్రకటించినట్లు ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాలు వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, పెట్టుబడులు, సాంకేతికత వంటి పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించుకుంటున్నాయి.
అవార్డు స్వీకరించిన అనంతరం ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ గౌరవాన్ని తన వ్యక్తిగత విజయంగా కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు. ఈ సత్కారానికి ఇండోనేషియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఆర్థిక సహకారం, రక్షణ భాగస్వామ్యం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు.
