Baby Murder | ప్రమాదం అంటూ నాటకం.. విచారణలో అసలు నిజం

Baby Murder |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బెంగళూరులో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 11 నెలల పసికందును తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి ఏడుస్తోందనే కారణంతో ఆవేశానికి లోనై ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి శరీరంపై కనిపించిన అనుమానాస్పద గాయాలను గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దంపతుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో తల్లి విజయలక్ష్మి చిన్నారిని కాలితో తన్నినట్లు, అనంతరం ఆవేశంతో తండ్రి శేఖప్ప చిన్నారిని నేలకేసి బలంగా విసిరినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాల కారణంగా చిన్నారి మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులైన దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.