పరిహారంపై స్పష్టత ఇవ్వకుంటే సర్వేకు సహకరించం..
ఆదిలాబాద్, జూలై 7 (ఆంధ్రప్రభ): ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని గూడ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన భూ సర్వేను మంగళవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ముందుగా నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని, అనంతరం మాత్రమే సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. చెనాక–కోర్టక ప్రాజెక్టు పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం సుమారు 10 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టగా, ఇప్పటికే గూడ గ్రామానికి సంబంధించిన సాగుభూములపై ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా, మంగళవారం గ్రామానికి వచ్చిన సర్వే అధికారులను రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
గ్రామసభలో రైతులు మాట్లాడుతూ, నష్టపరిహారం, భూ హక్కులపై స్పష్టత ఇవ్వకుండా సామాజిక–ఆర్థిక సర్వే పేరుతో వివరాలు సేకరించడం సరికాదన్నారు. లీజు పేరుతో కొన్ని ప్రైవేటు కంపెనీలు తమ పట్టా పాస్‌బుక్కులను తమ వద్ద ఉంచుకుని ఇప్పుడు నష్టపరిహారం పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తనఖాలో ఉన్న భూములు, లీజుకు ఇచ్చిన భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పరిహారం, పంట నష్టంపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే తమ వివరాలు అందజేస్తామని, లేదంటే భూ సేకరణకు సహకరించబోమని స్పష్టం చేశారు. దీంతో గ్రామసభను రైతులు బహిష్కరించగా, సర్వే అధికారులు వెనుదిరిగారు. రైతుల అభ్యంతరాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
