పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని పలు పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక సీఐ మహేందర్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, ఇతర మాదకద్రవ్యాలు నిల్వ ఉంచారా, విక్రయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఐ మహేందర్ మాట్లాడుతూ, గుట్కాలు, నికోటిన్ కలిగిన పొగాకు ఉత్పత్తులు లేదా ఇతర మాదకద్రవ్యాలను విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత పదార్థాలను నిల్వ ఉంచినా, రహస్యంగా విక్రయించినా అది నేరమేనని స్పష్టం చేశారు.

పాఠశాలల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా గుట్కాలు లేదా ఇతర మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.