accident | ఆరుగురు మృతి

accident | ఆరుగురు మృతి
accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కిలోమీటర్ నంబర్ 262 వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాద తీవ్రతకు బస్సు భారీగా దెబ్బతింది.
ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన ఎస్‌ఐ రామచంద్ర, ఖైదీ ఛత్రపాల్‌తో పాటు మొత్తం ఆరుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రామచంద్ర ఖైదీని తీసుకుని ఢిల్లీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
