వైభవాన్ని చాటే ఆషాఢ మహోత్సవాలు..
ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధం
జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోత్సవాలు
ఆషాఢ సారె, గుప్త నవరాత్రులు, శాకంభరీ అలంకారంతో ఆధ్యాత్మిక శోభ
భక్తుల కోసం ప్రత్యేక దర్శన, సారె సమర్పణ ఏర్పాట్లు పూర్తి
వేద మంత్రోచ్చారణలు, హోమాలు, మహాపూర్ణాహుతులు..
నెల రోజుల ఆధ్యాత్మిక వేడుకలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : అమ్మవారికి అత్యంత ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజులపాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సారె సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంభరీ మహోత్సవాలు, విశేష పూజలు, వేదపారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

విశిష్టమైన ఆషాడ మాసం….
సనాతన ధర్మంలో ఆషాఢ మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఈ మాసంలో ఆదిశక్తి శ్రీ కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి వస్రాలు, కుంకుమ, పసుపు, గాజులు, పూలు, చలిమిడి, వండ్లు తదితర మంగళద్రవ్యాలతో కూడిన ఆషాఢ సారె సమర్పించడం చిరకాల సంప్రదాయం. ఈ ఏడాది జూలై 15న ఆషాఢ మాసం ప్రారంభమైన సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ సిబ్బంది అమ్మవారికి తొలి సారె సమర్పిస్తారు. ఆగస్టు 12న అమావాస్య రోజున ఆలయ వైదిక కమిటీ, అర్చకస్వాములు సంప్రదాయబద్ధంగా చివరి సారె సమర్పించి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఆషాఢ మాసం పొడవునా దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం తాము తీసుకొచ్చిన సారెను శ్రీ మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సమర్పించే అవకాశం కల్పించారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందజేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద రాజగోపురం నుంచి ప్రత్యేక మార్గంలో సారె సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నవరాత్రులు…

ఆషాఢ మాసంలోని గుప్త నవరాత్రుల సందర్భంగా జూలై 15 నుంచి 24 వరకు శ్రీ వారాహీదేవి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. లలితా పరాభట్టారిక దండనాథ స్వరూపిణిగా ఆరాధించే శ్రీ వారాహీదేవికి ప్రతిరోజూ పంచవారాహీ మంత్రాలతో విశేష జపాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, శత్రు బాధలు తొలగాలని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. జూలై 24 ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతితో నవరాత్రులు ముగియనున్నాయి.
వైభవంగా శాఖాంబరియోత్సవాలు….
జూలై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంభరీ మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరవు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంభరీ రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారిని శాకంభరీ రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శిస్తే కరవు దోషాలు తొలగి దేశంలో సస్యశ్యామలం నెలకొంటుందని భక్తుల విశ్వాసం. శాకంభరీ మహోత్సవాల్లో భాగంగా జూలై 27న విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వరణం, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 28న సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణం, వివిధ హోమాలు, మూలమంత్ర హవనాలు జరుగుతాయి. జూలై 29న సప్తశతీ పారాయణం, శాంతిపాక హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసనం, మార్జనం, ప్రసాద వితరణతో ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు….
ఆషాఢ మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దర్శన మార్గాలు, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల పంపిణీ, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, సారె సమర్పణ వేదికలు, సమాచార కేంద్రాలు, సేవాదళాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
