సీఎం సభకు జనసంద్రం కావాలి…
సీఎం సభకు జనసంద్రం కావాలి…
పథకాలు జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ విష ప్రచారం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ధ్వజం
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతులు, మహిళలు, యువత, కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు వివరించనున్నారని తెలిపారు. నస్తూరుపల్లిలో జరిగే సభకు సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు. సభలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ కావ్య తదితరులు పాల్గొంటారని చెప్పారు. రైతు భరోసా నిధులను సభ వేదికగా విడుదల చేసి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విష ప్రచారం..
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి చేరుతుండటాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు. తుమ్మిడి హెట్టి వద్ద డ్యామ్ నిర్మించాలని నిపుణులు సూచించినప్పటికీ, కేసీఆర్ నిర్ణయంతో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించారని ఆరోపించారు.
రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన పనులను డిజైన్ మార్చి దాదాపు లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. జిల్లాలో ప్రాజెక్టు నిర్మించినా భూపాలపల్లికి ఒక్క చుక్క నీరు అందలేదని, ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ వద్ద భూమి సడలిన స్వభావం (లూజ్ సాయిల్) ఉన్నప్పటికీ నిర్మాణం చేపట్టడం అవివేకమన్నారు. సీఎం మేడిగడ్డ పర్యటనతో గత ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతో బీఆర్ఎస్ బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఉపఎన్నికలు, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు.
రైతాంగానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చివరిగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు దేవన్ ,పిసిసి సభ్యులు మధు, కౌన్సిలర్లు సహదేవ్ , రాధ, నాయకులు ఆకుల మహేందర్, దాట్ల శ్రీను, తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
