ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం ఎక్కడ..?

ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం ఎక్కడ..?

స్వీకరణకే పరిమితమవుతున్న ఫిర్యాదులపై ప్రజల ఆవేదన

గత వారం 66 దరఖాస్తులు.. పరిష్కారాలపై స్పష్టత కరువు

హనుమకొండ, (ఆంధ్రప్రభ): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నప్పటికీ, వాటి పరిష్కారంపై స్పష్టత లేకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజలు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పారిశుద్ధ్యం, తాగునీరు, హార్టికల్చర్ తదితర విభాగాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ, సమస్యల పరిష్కారంలో ఆశించిన వేగం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం గత వారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు అందాయి. వాటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి 19, ఇంజనీరింగ్‌కు 21, రెవెన్యూకు 8, హెల్త్ అండ్ శానిటేషన్‌కు 12, నీటి సరఫరాకు 4, హార్టికల్చర్ విభాగానికి 2 దరఖాస్తులు సమర్పించబడ్డాయి.

అయితే ఈ దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? అనే వివరాలను ప్రజలకు వెల్లడించకపోవడం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత శాఖలు క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించి, ప్రజలకు సమాచారం అందించాలని పలువురు కోరుతున్నారు.

ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశం ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమేనని, దరఖాస్తుల స్వీకరణతోనే సరిపెట్టకుండా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.