ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ధర్నా
ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ధర్నా
గజ్వేల్, చేగుంట రోడ్డుపై బైఠాయించిన రైతులు
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.
రోడ్డుపై వడ్లు పోసి నిప్పంటించి నిరసన
భారీగా నిలిచిపోయిన వాహనాలు
గజ్వేల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం వడ్లు, మొక్కలు, పొద్దుతిరుగుడు కొనుగోలు చేయడం లేదంటూ శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేగుంట రోడ్డులో రైతులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ , రైతులకు వెంటనే న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.అలాగే రోడ్డుపై వడ్లు పోసి నిప్పంటించి రైతులు నిరసన తెలిపారు. రైతులు ధర్నా నిర్వహించడంతో భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ధర్నా వద్దకు పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ చెప్పారు. అలాగే గజ్వేల్ మండలం అహ్మదిపూర్ చౌరస్తా, జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్లపై ధర్నా నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పండించిన పొద్దు తిరుగుడు, వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వర్షాకాలం సమీపిస్తుందని వర్షాలు పడితే తాము పండించిన పంట నేరపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జాప్యం చేయకుండా వాహనాల సంఖ్యను పెంచి కొనుగోలు ప్రక్రియనువేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
