మహిళలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి

మహిళలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి
- చైన్ స్నాచర్ల కదలికలపై పోలీసుల హెచ్చరిక
రాయపోల్, ఆంధ్రప్రభ:
“క్షణిక నిర్లక్ష్యం.. జీవితాంతం బాధకు కారణం కాకూడదు” అంటూ ప్రజలకు రాయపోల్ ఎస్‌ఐ మానస అప్రమత్తత సూచనలు జారీ చేశారు. జిల్లాలో ఇటీవల చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
ఆదివారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలు కూడా తమ భద్రతపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రాత్రివేళల్లో ఇళ్ల ముందు లేదా ఆరుబయట నిద్రించే వారు నగలు ధరించకపోవడం మంచిదన్నారు.
గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వారి వివరాలు తెలుసుకోవాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. “నేరస్తులు ప్రజల నిర్లక్ష్యాన్నే అవకాశంగా తీసుకుంటారు. అప్రమత్తతే పెద్ద ఆయుధం” అని ఎస్‌ఐ మానస పేర్కొన్నారు.
ప్రజలు పోలీసులకు సహకరిస్తే చైన్ స్నాచింగ్‌లు, చోరీలను సమర్థంగా అరికట్టవచ్చని ఆమె తెలిపారు. “మన జాగ్రత్త.. మన కుటుంబ రక్షణ” అనే భావనతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
