విధ్వంసం నుంచి వికాసం వైపు..
2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు: సీఎం చంద్రబాబు
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం..
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు.
గత రెండేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత పాలకుల తప్పిదాలు ప్రజలకు శాపాలుగా మారాయని, లక్షలాది కుటుంబాలు వారి అరాచకాలకు బలయ్యాయని విమర్శించారు.

నచ్చని వారిని భయపెట్టేందుకు గత ప్రభుత్వం భూములను 22-ఏ జాబితాలో చేర్చిందని, వివాదాలు సృష్టించి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో తీసుకొచ్చిన చట్టం ప్రజల ఆస్తులపై భయాందోళనలు పెంచిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేశామని చెప్పారు.

భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని పేర్కొన్న ఆయన, గతంలో భూ పత్రాలపై నాయకుల ఫొటోలు ముద్రించారని, ఇప్పుడు వాటి స్థానంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా, పవిత్ర కార్యక్రమంలా నిర్వహిస్తున్నామని అన్నారు.

2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
విలేజ్ ఇనాం భూములను కూడా గత ప్రభుత్వం 22-ఏ జాబితాలో చేర్చిందని, ఇప్పటికే 1,971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని వెల్లడించారు. ఆటో మ్యుటేషన్ విధానం ద్వారా వారసత్వ ఆస్తులు సంబంధిత వారికే చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుంది ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించామని తెలిపారు. డోన్ నియోజకవర్గంలోని 2,074 ఎకరాల వక్ఫ్ భూములను కూడా 22-ఏ జాబితా నుంచి తొలగించి రైతుల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యల పరిష్కారంతో పాటు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కడప స్టీల్ ప్లాంట్, హీరో మోటార్స్, ఏఎంకేఏ డిఫెన్స్ ఫైటర్ జెట్ ప్లాంట్ ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

నంద్యాల జిల్లాలో కూడా ఉద్యానవన రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్లో 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా జలధార కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నంద్యాల జిల్లాలో 18 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకుంటేనే భవిష్యత్తులో నీటి భద్రత సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
