జన గణన దేశ భవిష్యత్తుకు పునాది

జన గణన దేశ భవిష్యత్తుకు పునాది
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, ఆంధ్రప్రభ ; జన గణన దేశ భవిష్యత్తుకు పునాదని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రాజేంద్రనగర్ లోని స్వగృహంలో పురపాలక సంఘ పరిధిలో జనగణనను ఎమ్మెల్యే రాము గురువారం ప్రారంభించారు.
ముందుగా కమిషనర్ సింహాద్రి మనోహర్ తో కలిసి సెన్సెక్స్ లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే తొలి విడత నమోదులో భాగంగా ప్రభుత్వ పోర్టల్లో స్వయంగా గృహ జాబితా, వసతులు, తన కుటుంబ వివరాలు నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా,వసతుల స్వీయ గణన జరుగుతుందని కమిషనర్ మనోహర్ తెలిపారు. మే 1 నుండి 30 వరకు రెండో విడతలో ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయి గణన జరుగుతుందని కమిషనర్ తెలిపారు.
ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. జనగణనలో గుడివాడ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నా కుటుంబ వివరాలను స్వీయ గణనలో నమోదు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రెండో విడతలో జన గణన ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా రెండు విడతలగా గణన నిర్వహిస్తుందని, ప్రజలు అపోహలకు తావు లేకుండా జనగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మనందరం ఇచ్చే సమాచారం వల్లే రేపు రోడ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు మన చెంతక చేరుతాయని ఎమ్మెల్యే రాము అన్నారు. పౌరులందరూ జనగణనలో పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
