వెల్లటూరులో కేడీసీసీబీ నూతన శాఖ ప్రారంభం..
- రైతులు, మహిళలకు మరింత చేరువలో బ్యాంకింగ్ సేవలు
జి.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) నూతన శాఖను గురువారం ఘనంగా ప్రారంభించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి శాఖను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, సహకార రంగాన్ని బలోపేతం చేయడం, రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వెల్లటూరు, పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరిక నూతన శాఖ ప్రారంభంతో నెరవేరిందని తెలిపారు. ఈ శాఖ ద్వారా రైతులకు సకాలంలో పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం మరింత వేగంగా అందుతుందని పేర్కొన్నారు.

కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా కేడీసీసీబీ పనిచేస్తోందన్నారు. వెల్లటూరు శాఖ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత రైతులు, మహిళా సంఘాలకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, రికవరీలో కేడీసీసీబీ రాష్ట్రంలోనే ముందంజలో ఉందని తెలిపారు.
నూతన శాఖ ద్వారా పంట రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు, డిపాజిట్ పథకాలు తదితర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు. రైతులు పాస్బుక్, ఆధార్ కార్డులతో నేరుగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బ్యాంకు అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
