జీడి నెల్లూరులో దొంగనోట్లు కలకలం..

గంగాధర నెల్లూరు, ఆంధ్రప్రభ ; చిత్తూరు జిల్లాలో దొంగనోట్లు మారుస్తామని చెప్పి రూ.10 లక్షలు కాజేసిన ముఠాలో ట్రాఫిక్ ఏఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్ పాల్గొనడం కలకలం రేపింది. ఈ ఘటనలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ కానిస్టేబుల్ రవితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జీడీ నెల్లూరు మండలం మిట్ట హరిజనవాడకు చెందిన సెల్వం, దేవా, వేలూరుకు చెందిన ఇళంగోవన్ కలిసి దొంగనోట్లు ఇస్తామని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్‌లను నమ్మించారు. రూ.10 లక్షల నగదుతో గంగాధర నెల్లూరుకు రావాలని సూచించారు.
బాధితులు అక్కడికి చేరుకున్న తర్వాత నిందితులు నగదు తీసుకుని, తాము పోలీసులమంటూ బెదిరించి మోసానికి పాల్పడ్డారు. అనంతరం బాధితులు తాము కొబ్బరికాయల కొనుగోలుకు వచ్చామని చెప్పి జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతం దొంగనోట్ల ముఠా సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసుపై గంగాధర నెల్లూరు సీఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
