గోదావరి జలాలతో ప్రత్యేక పూజలు..

  • సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం

ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామదేవతలకు గోదావరి జలాలతో జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

గోదావరి నది నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చిన గ్రామస్తులు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గ్రామ శివారులోని గ్రామదేవతల ఆలయానికి చేరుకుని జలాభిషేకం నిర్వహించారు. అనంతరం వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై రోజులైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పంటల సాగు ప్రారంభించాలని ఆకాంక్షిస్తూ గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాజేనోల్ల పెద్ద గంగారాం, కోశాధికారి లక్ష్మీనారాయణ, గోవింద్ రెడ్డి, కట్ట సుధాకర్, సుఖాంత్ గౌడ్, మల్లోల పోశెట్టి, అలవాల శ్రీను, తెనుగు గోపి, వేల్పుల సాయిలు, నీరడి విజయ్ చందర్, చిన్న లక్ష్మయ్య, ముత్తన్న, కాషా రవి, మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.