సార్ వస్తే సూపర్ ఫుడ్ – లేకుంటే నీళ్లచారు..
విద్యార్థి సంఘాల సంచలన ఆరోపణ
ఫుడ్ కమిషనర్ వచ్చారని ఒకరోజే పండగ భోజనం..
మిగతా రోజులు కుళ్లిన కూరలేనా? విద్యార్థి నేతల ఫైర్
ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన అధికారులు..
ఈరోజే కడుపునిండా తిన్నాం: విద్యార్థులు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా, మోడల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో అధికారులు తనిఖీలకు వచ్చిన రోజే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
శుక్రవారం నందికొట్కూరులో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ కమిషన్ చైర్మన్‌కు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య కార్యదర్శి డక్కా కుమార్, రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బి. శేఖర్ నాయుడు, ఆంధ్ర విద్యార్థి సంఘం కార్యదర్శి కే. నాగరాజు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలకు వస్తున్నారనే సమాచారం ముందుగానే అందడంతో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, వంట ఏజెన్సీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. సాధారణ రోజుల్లో అందించని నాణ్యమైన భోజనాన్ని తనిఖీ రోజున మాత్రమే అందించారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని పలు పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, నాణ్యత లేని పప్పు, సాంబారు, కూరగాయలు వడ్డిస్తున్నారని ఆరోపించారు. సాధారణంగా ఉపయోగించని ఆహార పదార్థాలను తనిఖీ రోజున మాత్రమే వినియోగించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
తనిఖీ రోజున విద్యార్థులు కడుపునిండా నాణ్యమైన భోజనం చేశారని, అయితే ఇదే పరిస్థితి ప్రతిరోజూ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫుడ్ కమిషన్ చైర్మన్‌ను కోరారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, కస్తూర్బా, మోడల్ పాఠశాలలు, ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యత లేని భోజనం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.
అలాగే అధికారులు తనిఖీల కోసం వచ్చినప్పుడే కాకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందేలా చూడాలని ఫుడ్ కమిషన్‌ను కోరారు.
