డీఏపీ కోసం మహారాష్ట్ర బాట పడుతున్న రైతులు..

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ డీఏపీ ఎరువు అందుబాటులో లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ రైతులు పక్క రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లి డీఏపీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం రైతులు మాట్లాడుతూ.. స్థానిక ఎరువుల దుకాణాలు, వ్యవసాయ కేంద్రాల్లో ఎక్కడ అడిగినా డీఏపీ లేదనే సమాధానం వస్తోందన్నారు. ఖరీఫ్ సాగుకు డీఏపీ అత్యవసరమైన సమయంలో అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

యూరియా పంపిణీ కోసం యాప్ విధానం తీసుకొచ్చి ఇప్పటికే రైతులను ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు డీఏపీ కొరత కూడా తీవ్రంగా వేధిస్తోందని వారు పేర్కొన్నారు. డీఏపీ ఇవ్వాలని అధికారులను కోరితే ప్రత్యామ్నాయ ఎరువులు వాడాలని సూచిస్తున్నారని, అయితే రైతులకు అవసరమైన డీఏపీని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

మహారాష్ట్ర నుంచి డీఏపీ తీసుకురావడానికి అదనపు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోందని, దీంతో సాగు వ్యయం మరింత పెరుగుతోందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే రైతులకు సరిపడా డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచి వారి ఇబ్బందులను తొలగించాలని రైతులు గాడ్గే సుభాష్, విఠల్, ప్రళాద్, శ్రీరామ్, మారుతి కోరారు.