ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.34 వేల విరాళం..
మాట నిలబెట్టుకున్న సర్పంచ్
ఐదు నెలల జీతాన్ని చెక్కు రూపంలో అందజేసిన డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ మండలంలోని మహాద్వార్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తన వంతు సహకారాన్ని అందిస్తూ మరోసారి ఆదర్శంగా నిలిచారు. గతంలో గ్రామసభలో ఇచ్చిన హామీ మేరకు తన ఐదు నెలల జీతానికి సమానమైన రూ.34 వేల చెక్కును శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరాములు, ఉపాధ్యాయులు ఆంజనేయులు, రాములకు వార్డు సభ్యుల సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామ ప్రజలు, దాతలు కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ అందించిన విరాళంపై ప్రధానోపాధ్యాయులు వెంకటరాములు, ఉపాధ్యాయులు ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను పాఠశాల అవసరాలకు వినియోగించి విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, వార్డు సభ్యులు డాక్టర్ ఆశప్ప, బాట నరసింహ, పుల్లకూరి నాగప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ కర్ని శ్రీనివాస్, బుడబోయి చంద్రప్ప, కథనుల్ల కిష్టప్ప, కర్నే బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
