మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం..
- మహిళా సంఘాలకు అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం
- మహిళా భవనాలు, వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణంతో సాధికారతకు కొత్త దిశ.
- మహిళలు ఆత్మస్థైర్యంతో హక్కుగా జీవించాలి..
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మహిళా భరోసా కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి భవనాన్ని పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్‌లో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనం అత్యంత ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైందని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళల సంక్షేమం, స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, శిక్షణా కార్యక్రమాలు చేపట్టడానికి, తమ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించడానికి ప్రత్యేక వేదికల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలు సమావేశాల కోసం సరైన స్థలం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఈ భవనాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
మహిళలకు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్న మంత్రి, అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించే అంశంపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు.
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గ్రామీణ మహిళల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తాయని పేర్కొన్నారు.
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్సీ కుచ్చుకుళ్ళ దామోదర్ రెడ్డి, అదనపు కలెక్టరు దేవ సహాయం, అమరేందర్ నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ, సత్యారెడ్డి, ఇందిర, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
