Chevella Congress | గాంధీభవన్ ఎదుట కాలే యాదయ్యకు వ్యతిరేకంగా నిరసన
Chevella Congress | గాంధీభవన్ ఎదుట కాలే యాదయ్యకు వ్యతిరేకంగా నిరసన
‘ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం’ అంటూ గాంధీభవన్ ఎదుట ఆందోళన
నామినేటెడ్ పదవులు మాజీ బీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారని ఆరోపణలు
‘కాలే యాదయ్య డౌన్ డౌన్’ నినాదాలతో కార్యకర్తల నిరసన
Chevella Congress | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బహిర్గతమైంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పాత కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమించిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
గాంధీభవన్ ఎదుట పెద్దఎత్తున చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు “కాలే యాదయ్య డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవుల నియామకాల్లో ఎమ్మెల్యే కాలే యాదయ్య జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలను విస్మరించి, ఇటీవలే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు.
పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ కార్యకర్తలకు గుర్తింపు లేకుండా, నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు అవకాశాలు కల్పించడం వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవులు కల్పించాలని, పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని నిరసనకారులు కోరారు. గాంధీభవన్ వద్ద జరిగిన ఈ ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
