ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు అండగా మైనార్టీ యువకులు
భీమ్‌గల్ రూరల్ (ఆంధ్రప్రభ): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని మైనార్టీ యువకులు తెలిపారు. భీమ్‌గల్ పట్టణంలోని కమ్యూనిటీ హాల్‌లో ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మైనార్టీ యువకులు, బీఎల్‌వోలు, మెప్మా ఆర్‌పీలు ఉచితంగా సహాయం అందిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, ఆన్‌లైన్ ప్రక్రియపై అవగాహన లేని వారికి ప్రత్యేకంగా ఫారాలు నింపి మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఎవరి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారు కోరారు. ఫారాలు నింపేందుకు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తదితర అవసరమైన పత్రాలతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సంతోష్, నవీన్, మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ హుస్సేన్, సుమీర్ ఖాన్, అమిర్ ఖురేషి, ఆసిమ్, అవేస్, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, మైనార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
