అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
- నాణ్యతలో రాజీ పడొద్దు అన్నదాన భవనాన్ని పరిశీలించిన చైర్మన్ బొర్రా గాంధీ
- దేవాదాయ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శేఖర్తో కలిసి పనుల పరిశీలన
- కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాల అమలుపై ప్రత్యేక సమీక్ష
- అన్నదాన భవనంలో రంగులు, టైల్స్, నిర్మాణ నాణ్యతపై కీలక సూచనలు
- భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేవాదాయ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శేఖర్తో కలిసి ఆలయ ప్రాంగణంలోని వివిధ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా భక్తులకు అన్నదాన సేవలు అందించే అన్నదాన భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన చైర్మన్, నిర్మాణ నాణ్యతతో పాటు భవనంలో చేపడుతున్న అంతర్గత పనులపై ఆరా తీశారు.
ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఇచ్చిన ఆదేశాలు, సూచనల అమలు తీరును సమీక్షించి, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవనానికి వేస్తున్న రంగులు, గోడలకు అమర్చుతున్న టైల్స్ నాణ్యత, ఆకర్షణీయత, భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా చేపట్టాల్సిన మార్పులపై సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రతి పనిని నిర్దేశిత ప్రమాణాలతో పూర్తి చేయాలని చైర్మన్ బొర్రా గాంధీ ఆదేశించారు.
