అక్రమ పశువుల రవాణా గుర్తింపు

​10 పశువుల స్వాధీనం.. వాహనం సీజ్
​సూర్యాపేట జిల్లాకు చెందిన డ్రైవర్‌పై కేసు నమోదు
చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 పశువులను పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…​శుక్రవారం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, కానిస్టేబుల్ సీతారాం రెడ్డి లు పెట్రో మొబైల్-1 వాహనంలో విధులను నిర్వర్తిస్తున్నారు.

ఈ క్రమంలో నల్గొండ మార్గం నుండి హైదరాబాద్ వైపు అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ​ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనాన్ని ఆపి చెక్ చేయగా అందులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇరుకైన రీతిలో తరలిస్తున్న 10 పశువులు (5 ఆవులు, 5 ఎద్దులు) లభ్యమయ్యాయి.

​కోదాడ సంత నుండి హైదరాబాద్‌ కు…

వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్‌ను పోలీసులు విచారించగా అతని పేరు ఎస్కే కరీముల్లా బాబా (22), సూర్యాపేట జిల్లా నడిగూడెం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ పశువులను కోదాడ వారపు సంతలో కొనుగోలు చేసి, అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో పశువులను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు. కాగా పశువుల అక్రమ రవాణా జాతీయ రహదారిపై తరచుగా జరుగుతూనే ఉన్నందున దీన్ని పూర్తిగా నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.