Andhra Pradesh population growth | జనాభా తగ్గుదలపై ఏపీ ముఖ్యమంత్రి ఆందోళన

Andhra Pradesh population growth | జనాభా తగ్గుదలపై ఏపీ ముఖ్యమంత్రి ఆందోళన

Andhra Pradesh population growth | ఫెర్టిలిటీ సదుపాయాల పెంపుపై కీలక సూచనలు
రోడ్డు భద్రత, వైద్య సౌకర్యాలతో జనాభా వృద్ధికి మార్గం

Andhra Pradesh population growth | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల రాష్ట్ర జనాభా తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గుదల వల్ల దీర్ఘకాలిక నష్టాల పట్ల కూడా ఆయన కలవరాన్ని వ్యక్తం చేశారు. రెండవ, మూడవ బిడ్డను కలిగి ఉన్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు.

మూడు దశాబ్దాల క్రితం జనాభా పెరుగుదలపై వ్యక్తమైన ఆందోళనకు బదులు ఇప్పుడు జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. జనాభా పెరుగుదల వల్ల ఆహార కొరత ఏర్పడి, దారిద్ర్యం పెరుగుతుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు 1975 నుంచి 1977 వరకూ కుటుంబ నియంత్రణకు బలవంతపు ఆపరేషన్లు జరిగాయి.

గతంలో బ్రిటిష్ హయాంలో థామస్ రాబర్ట్ మాల్టస్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తలు అధిక జనాభా వల్ల అరిష్టాలు పెరుగుతాయని అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. 1798లో ఆయన తన పుస్తకంలో జనాభా పెరుగుదల సూత్రంపై ఒక వ్యాసం రాస్తూ, ఆహార ధాన్యాల ఉత్పత్తి కన్నా, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని అన్నారు. జనాభా పెరుగుదలకూ, ఆహార ధాన్యాల ఉత్పత్తికీ మధ్య అసమాన స్థితి వల్ల అంతిమంగా క్షామం ఏర్పడుతుందనీ, జనంలో రోగాలు వ్యాపిస్తాయనీ, యుద్ధం కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రెండు శతాబ్దాల తర్వాత అమెరికాకు చెందిన వృక్షశాస్త్రవేత్త పాల్ ఎహ్ర్లిచ్ 1968లో తాను విడుదల చేసిన పుస్తకంలో సరిగ్గా ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ పుస్తకం పేరు ‘జనాభా బాంబు’. ఆహారోత్పత్తి తగినంత లేకపోతే కోట్లాది ప్రజలు ఆకలి మంటలకు బలి అవుతారని ఆయన హెచ్చరించారు. అయితే, సస్య విప్లవం వల్ల పరిస్థితి మారిపోయింది. ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పద్ధతుల వల్ల వ్యవసాయ విధానాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.

ఆహారోత్పత్తులు చెప్పుకోదగిన రీతిలో పెరిగాయి. దాంతో దేశంలో క్షామ పరిస్థితులు నివారించబడ్డాయి. ఇప్పుడు అనేక దేశాల్లో జనాభా పెరుగుదల సమస్యగా లేదు. ఇంకా చెప్పాలంటే, జనాభా తరుగుదల అందరినీ ఆందోళన పరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. చైనా జనాభా 2100 నాటికి 45 కోట్లు తగ్గవచ్చని కొందరు నిపుణులు అంచనా వేశారు. చైనా జనాభా ప్రస్తుతం 140 కోట్లు ఉంది. ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

జాతులు అంతరించిపోవడం, డార్విన్ సిద్ధాంతం, జనాభా తగ్గడంతో అనేక విస్తృతమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన రాసిన ‘జాతుల పుట్టుపూర్వోత్తరాలు’ పుస్తకంలో చాలా జాతులు ప్రస్తుత వాతావరణంలో ఇమడలేక అంతరించిపోతాయని పేర్కొన్నారు. మనిషి మనుగడపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, ఏ జాతి లేదా వృక్ష జాతి శాశ్వతంగా ఈ భూమిపై ఉండవని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ జనాభా పెరుగుతుందా? జనాభా పెరుగుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇచ్చే పథకం నిర్మాణాత్మకమైనదే. అయితే, జనాభా పెరుగుదల అనేది సాంఘిక, ఆర్థిక, వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆర్థికపరమైన ప్రోత్సాహకాల వల్లనే జనాభా పెరుగుతుందనుకోవడం పొరపాటు.

వీటిలో ముఖ్యమైనది ఫలదీకరణ! ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశం మొత్తం మీద పిల్లలు పుట్టకపోవడం అనేది సామాజికంగా ఒక మచ్చలా పరిగణిస్తుంటారు. పిల్లలు లేని తల్లిదండ్రులు తరచూ మనోవ్యథకు గురవుతూ ఉంటారు. సమాజంలో వారి పట్ల చిన్నచూపు కూడా వారి వ్యథకు కారణం అవుతుంది. జనాభా పెరుగుదలకు ఆధునిక విజ్ఞాన పద్ధతులు, ఇతర సౌకర్యాలు అమలులోకి వచ్చినా అవన్నీ ఖరీదుతో కూడినవి. పైగా, గ్రామాల్లో ప్రజలకు అవి అందుబాటులో లేవు.

జనాభాను పెంచాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో కోరుతున్నట్లయితే, అండాలను భద్రపర్చే సౌకర్యాలు, ఫలదీకరణ సౌకర్యాలను పెంచాలి. ముఖ్యంగా మహిళలకు వైద్య సదుపాయాలు పెంచాలి. జీవనవిధానం, ఆలస్యంగా పెళ్లిళ్లు కావడం వంటి కారణాల వల్ల పిల్లలు ఆలస్యంగా పుడుతుంటారు. విద్యావ్యాప్తి వల్ల కొందరు చదువు పూర్తి అయితే కానీ, పిల్లలు వద్దనుకునే వారు ఉంటారు. కారణాలు ఏమైనా పిల్లలు కలగకపోవడానికి దంపతుల మధ్య అవగాహన, నిర్ణయాలు మొదలైనవి ఉంటాయి.

వంధత్వం వల్ల దంపతులకు పుట్టే పిల్లల శరీర నిర్మాణంలో తేడాలు, హార్మోన్లలో తేడాలు, వైద్య పరిస్థితుల్లో తేడాలు మొదలైనవి కనిపిస్తూ ఉంటాయి. ఆలస్యంగా పెళ్లి కావడం, జీవనవిధానం కారణం వల్ల కూడా పిల్లలు ఆలస్యంగా కలుగుతారు. ఫెర్టిలిటీ క్లినిక్‌లను ప్రభుత్వం పెద్ద సంఖ్యలో తెరవాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సౌకర్యాలను కల్పించాలి. ప్రత్యేక వైద్యుల సేవలు అందుబాటులో ఉంచాలి. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలి.

సర్వే, ఉన్నత ప్రమాణాలు గల ఫెర్టిలిటీ క్లినిక్‌లు: ఆంధ్రప్రదేశ్ ఫెర్టిలిటీ క్లినిక్‌లపై ప్రభుత్వం సర్వే జరిపించాలి. ఉన్నత ప్రమాణాలు గల క్లినిక్‌లు ఏర్పాటు చేయాలి. క్లినిక్‌ల సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉండాలి. మహిళలందరికీ ఉచిత చికిత్స అందుబాటులో ఉంచాలి. ఇందుకు తగ్గట్టు క్లినిక్‌లో సిబ్బందిని పెంచాలి. నియోనాటల్ కేర్‌ను మెరుగుపర్చాలి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మెరుగుపర్చాలి. పౌష్టికాహార కార్యక్రమాన్ని వృద్ధి చేయాలి. భ్రూణ హత్యల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి: రోడ్డు ప్రమాదాల వల్ల రాష్ట్రంలో ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. రోడ్డు భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రమాదాల నివారణ ద్వారా జనాభా వృద్ధి జరిగేట్టు చూడాలి. ఫెర్టిలిటీ చికిత్స పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచాలి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఫెర్టిలిటీ క్లినిక్‌లు, శిశు వైద్యశాలలను పెంచాలి. ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ ఏర్పాటు చేయాలి. ఆధునిక శస్త్రచికిత్స విధానాలను అందుబాటులో ఉంచాలి. అయితే, ప్రభుత్వం తగిన ఆర్థిక వనరులను సమకూర్చలేకపోవడం వల్లనే ఆశయాలను సాధించలేకపోతున్నది. మేనరికపు వివాహాలను అరికట్టాలి. దేశంలో ధనవంతులైన కుటుంబాలు పార్సీలు, టాటాలు ఉన్నాయి. 1947 నాటికి దేశంలో వారి జనాభా లక్ష. ఇప్పుడు 12,000.

– డా. పెంటపాటి పుల్లారావు
9350833188