Telangana government schools | ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు తగ్గే ప్రమాదం

Telangana government schools | ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు తగ్గే ప్రమాదం
Telangana government schools | జనాభా లెక్కల విధుల్లో టీచర్లు
నామమాత్రంగానే సాగుతున్న బడిబాట ప్రచారం
Telangana government schools | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, సర్కారు విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘జయశంకర్ బడిబాట’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో సందిగ్ధంలో పడింది. మే 14న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటం, మరోవైపు ఉపాధ్యాయులంతా జనాభా లెక్కల సేకరణ (సెన్సస్) విధుల్లో నిమగ్నం కావడంతో బడిబాట అగమ్యగోచరంగా మారింది.
జనాభా లెక్కల నీడలో బడిబాట
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు జనాభా లెక్కల సేకరణ విధుల్లో తలమునకలై ఉన్నారు. అత్యధిక శాతం మంది టీచర్లు ఈ సర్వే పనుల్లోనే ఉండటంతో, బడిబాట నిర్వహించే వారు కరువయ్యారు. జనాభా లెక్కల విధుల్లో లేని కొద్దిపాటి మంది ఉపాధ్యాయులు మాత్రమే అక్కడక్కడ బడిబాట నిర్వహిస్తున్నప్పటికీ, అది నామమాత్రంగానే సాగుతోందని తెలుస్తోంది.
ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరించి, తల్లిదండ్రులను ఒప్పించాల్సిన టీచర్లు లేకపోవడంతో ఈ నెల 19 వరకు జరిగే బడిబాట ప్రచారపర్వం కుంటుపడింది. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా ఉపాధ్యాయులు జనాభా లెక్కల్లోనే కొనసాగితే బడిబాట కార్యక్రమం వృథానే అని పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు అంటున్నారు. ఒకవైపు బోధన, మరోవైపు సర్వేలు, ఇంకోవైపు బడిబాట.. ఈ మూడింటి మధ్య తాము నలిగిపోతున్నామని టీచర్లు వాపోతున్నారు.
లక్ష్యం 10 శాతం.. వాస్తవం వేరే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లను గత ఏడాది కంటే 10 శాతం పెంచాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ లక్ష్యం నెరవేరడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, ప్రచారం లోపించడంతో కొత్త విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు రావడం లేదు.
జూన్ 12న బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు జరిగిన అడ్మిషన్ల ప్రక్రియ అత్యంత నిరాశాజనకంగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే గత ఏడాది కంటే ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అడ్మిషన్ల ప్రక్రియ గురించి ఉన్నతాధికారులు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని, మండల కేంద్రాల్లో ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
వీటిని ఎంఈఓ, డీఈఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కానీ నేడు చాలా మండలాల్లో ఈ డెస్క్‌లు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విద్యా నిపుణులు కోరుతున్నారు.
