Bellampalli | ‘ట్రాఫిక్’ పోలీస్ స్టేషన్ ఏర్పాటయ్యేనా?
- పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ…
- పట్టణ ప్రజల చిరకాల డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించేనా..?
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణం నేడు మంచిర్యాల జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా సంస్థలు, షాపింగ్ హబ్‌లు ఇలా అన్నీ ఒక్కటైనట్టుగా ఈ పట్టణం ప్రజల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా మారింది. కానీ మొత్తం అభివృద్ధి పరంపరలో ఒకే ఒక్క లోపం ఉంది. అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకపోవడం.
పట్టణం విస్తరిస్తూనే ఉన్నా, వాహనాల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్నా… బెల్లంపల్లిలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అనేది మాత్రం కలగానే మిగిలిపోతోంది.
ప్రధాన రహదారిపై తీవ్ర ఒత్తిడి
పట్టణంలో వన్‌టౌన్, టూటౌన్ పోలీస్స్టేషన్లు, ఏసీపీ కార్యాలయం, సబ్‌కలెక్టర్ కార్యాలయం, ఫారెస్ట్ డివిజన్, మున్సిపల్ కార్యాలయం, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సింగరేణి ఏరియా ఆసుపత్రి, 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు, హాస్టళ్ల వంటి ప్రభుత్వ, విద్యాసంస్థలు అనేకం ఉండటంతో ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలు వివిధ అవసరాల కోసం బెల్లంపల్లి పట్టణంలోకి వస్తున్నారు.
కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి కాల్టెక్స్ రైల్వే స్టేషన్ వరకు ఒక్కటే ప్రధాన రహదారి ఉండటంతో పాటు, పట్టణంలోని ఎక్కువ కాలనీలు ఈ రహదారి ఇరువైపులా విస్తరించాయి. మార్కెట్ ఏరియాలో వ్యాపార కార్యకలాపాలు పెరగడం కూడా జనం రాకపోకలను మరింత పెంచింది. దీంతో రహదారి నిత్యం ట్రాఫిక్‌తో నిండిపోతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో, పది నిమిషాల ప్రయాణానికి అరగంటకు పైగా సమయం పడుతుంది..
జనాభా పెరుగుదల, ట్రాఫిక్ రద్దీ
సింగరేణి ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు పెద్ద సంఖ్యలో స్థిరనివాసాలు ఏర్పరచుకోవడంతో కొత్త కాలనీలు పెరిగి, భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఇటీవలి నాలుగేళ్లుగా బెల్లంపల్లిలో జనాభా భారీగా పెరిగిపోవడంతో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.
రోజూ కాసిపేట, కన్నెపల్లి, తాండూర్, భీమిని, నెన్నెల, రామకృష్ణాపూర్, మందమర్రి, తిర్యాణి, రేబ్బెన, ఆసీఫాబాద్, బెల్లంపల్లి రూరల్ వంటి అన్ని మండలాల ప్రజలు విద్య, వ్యాపారం, ఆస్పత్రులు, బ్యాంకులు, షోరూములలో తమ అవసరాలకు బెల్లంపల్లిని ఆశ్రయిస్తున్నారు.
వీటన్నింటి ప్రభావం పట్టణ ట్రాఫిక్‌పై మంచుతుపానులా పడుతోంది. మార్కెట్ సెంటర్, బస్‌స్టాండ్ చౌరస్తా, ఏఎంసీ, మున్సిపల్ చౌరస్తా, చౌడేశ్వరీ, పాత బస్‌స్టాండ్ రోడ్, శిశుమందిర్ నుండి రాళ్ళపేట రోడ్ వరకు పట్టణం మొత్తం నిత్యం రద్దీతోనే కనిపిస్తుంది.
అనధికార పార్కింగ్లు, దుకాణాల ముందే వాహనాలు నిలిపేయడం, ఆటోలు రోడ్డుమధ్య పార్క్ చేయడం వంటివి చిన్న చిన్న ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్‌ను పర్యవేక్షించే ప్రత్యేక సిబ్బంది లేకపోవడం వల్లే అవ్యవస్థలు ఎక్కువవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. కనీసం ఒక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్, నాలుగు నుంచి ఐదు కానిస్టేబుళ్లు, డిజిటల్ సిగ్నల్స్, సీసీటీవీలు, జెబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యల్లో సగం తగ్గిపోతుందని స్థానిక ఆటో యూనియన్లు, వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్రమంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, బెల్లంపల్లిలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు.
