ఆదర్శంగా నిలిచిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

ఆదర్శంగా నిలిచిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు ఇళ్లను నిర్మిస్తున్న కేంద్ర మంత్రి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపితమైంది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగినప్పటికీ తన మూలాలను మరువకుండా, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన మెట్ట లక్ష్మీనరసింహ శ్రీనివాస్ 1990 నుంచి బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా సేవలందించారు. కరోనా సమయంలో ఆయన మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చలించిపోయారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించి వారికి సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు.

అదేవిధంగా కొండేపూడి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త రామారావు గత మూడు దశాబ్దాలుగా ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ అభివృద్ధికి సేవలందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఇంటి నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను స్వీకరించారు.

ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండు ఇళ్ల నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి, పనులు వేగంగా పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తున్నారు. గురువారం ఇళ్ల స్లాబ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని పనులను పరిశీలించారు. అంతేకాకుండా పాలకోడేరు మండల అధ్యక్షుడు బలరామరాజు, బీజేపీ నాయకుడు ఐకే రాజు తదితరులతో కలిసి శ్రమదానం చేసి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు.

పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి బీజేపీ అధిష్టానం శ్రీనివాస వర్మకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించగా, ఆయన కార్యకర్తల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని వారికి అండగా నిలుస్తున్నారు. ఉన్నత పదవులు వచ్చినా కార్యకర్తలను మరువకుండా సేవా భావంతో ముందుకు సాగుతున్న ఆయన తీరుపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply