ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు18 ఫిర్యాదులు..

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు18 ఫిర్యాదులు..
విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యాన చంద్ర ప్రజల నుండి 18 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును తీసుకుని, క్షేత్ర స్థాయి లో పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించి ఎక్కువ వినతులు వస్తున్నాయని, అధికారుల సమన్వయంతో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు.ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన రహదారుల్లో 92 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, గత ఏడాది కంటే వీటి సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. కేవలం మనుషులకే కాకుండా, మూగజీవాల కోసం కూడా ప్రత్యేకంగా నీటి వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అలాగే, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని డ్రైనేజీ కాలువల పూడికతీత పనులను భారీ ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు.ఈ వారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు మొత్తం 18 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక 5, ఇంజనీరింగ్ 7, హౌసింగ్ 2, ప్రజారోగ్యం 1, రెవెన్యూ 1, ఎస్టేట్ విభాగం 2 నుంచి అందుకున్నారు.
