Banaganapalli | రెవెన్యూ డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్..

Banaganapalli | రెవెన్యూ డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్..

నంద్యాల బ్యూరో, (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలో పరిపాలనా వ్యవస్థ బలోపేతం చేయ‌డంలో భాగంగా, జిల్లాల పునర్విభజనలో భాగంగా బనగానపల్లెను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా చేశారు.

ఒకప్పుడు ఫ్యాక్షన్‌ ప్రాంతంగా ముద్రపడిన బనగానపల్లె, ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా పాలనాపరమైన సమస్యల పరిష్కారానికి ఈ డివిజన్‌ ఏర్పాటు దోహదపడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, డోన్‌, నంద్యాల రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

కొత్తగా ప్రతిపాదించిన బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో డోన్‌ డివిజన్‌లోని బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల మండలాలను, నంద్యాల డివిజన్‌లోని కొలిమిగుండ్ల, సంజామల మండలాలను కలపాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు, డోన్‌ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండలాన్ని కూడా చేర్చి మొత్తం ఆరు మండలాల పరిధిలో బనగానపల్లె డివిజన్‌ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.

ఈ మండలాలకు గతంలో డివిజన్‌ కేంద్రాలకు ఉన్న 53 కి.మీ. నుండి 80 కి.మీ. దూరం, బనగానపల్లె డివిజన్‌ కేంద్రం ఏర్పడటంతో కేవలం 15 కి.మీ. నుండి 36 కి.మీ. వరకు తగ్గనుంది. దీనివల్ల రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండి, పరిపాలనాపరంగా పనులు సక్రమంగా సాగుతాయని, ప్రజల వద్దకే పాలన వస్తుందని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి కృషిని ఈ ప్రాంత ప్రజలు ప్రశంసిస్తున్నారు.

ముఖ్యమంత్రిని ఒప్పించడంలో మంత్రి విజయం సాధించడంపై ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాపరాయి గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న ఈ ప్రాంతం పారిశ్రామికంగానూ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

అయితే, మరోవైపు, నంద్యాల జిల్లాలో ఉన్న డోన్‌, ప్యాపిలి మండలాలు జిల్లా హెడ్‌క్వార్టర్‌కు సుమారు 94 కి.మీ. దూరంలో ఉండటం వల్ల, వాటిని కర్నూలు జిల్లాలో (53 కి.మీ. మరియు 77 కి.మీ. దూరంలో) కలపాలని ప్రజలు ప్రతిపాదిస్తున్నారు. ఈ మార్పు వల్ల 20 నుంచి 25 కి.మీ. దూరం తగ్గుతుందని కోరుతున్నారు.

నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలులో కలపాలని కొందరు ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుతానికి జిల్లాల్లో ఎలాంటి మార్పు లేకుండా కేవలం బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మాత్రమే ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, ఈ నిర్ణయం అమల్లోకి రావడంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేసిన కృషి కీలకంగా నిలిచిందని పేర్కొంటున్నారు.

Leave a Reply