ఎల్‌నినో పరిస్థితులపై రైతు సేవా సిబ్బందికి అవగాహన

  • ఏపీఏఐఎంఎస్ యాప్‌లో పంటల వివరాల నమోదుపై శిక్షణ
  • శాటిలైట్ ఆధారంగా పంటల పర్యవేక్షణకు చర్యలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు గురువారం ఉరవకొండ వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాల రైతు సేవా సహాయ కేంద్రాల సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఏపీఏఐఎంఎస్యాప్‌లో రైతుల పంట వివరాలను సర్వే నంబర్ వారీగా, రైతుల వారీగా నమోదు చేయాలని సూచించారు. ఈ యాప్‌లో నమోదయ్యే సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) డ్యాష్‌బోర్డు ద్వారా కూడా పరిశీలించే సౌకర్యం కల్పించారని తెలిపారు.

ప్రతి సర్వే నంబర్‌లో ఏ పంట సాగు చేస్తున్నారో, ఆ పంట ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం మండలంలో 2,850 హెక్టార్లలో కంది, 2,150 హెక్టార్లలో వేరుశనగ సాగు జరిగినట్లు వెల్లడించారు. ఈ సాగు విస్తీర్ణానికి సంబంధించిన రైతుల పూర్తి వివరాలను ఏపీఏఐఎంఎస్ యాప్‌లో నమోదు చేయాలని రైతు సేవా సహాయ కేంద్రాల సిబ్బందికి సూచించారు.

ఈ యాప్ వాతావరణ కేంద్రాల సమాచారంతో కూడా అనుసంధానమై ఉంటుందని తెలిపారు. పంట ఆరోగ్యంగా ఉంటే యాప్‌లో ఆకుపచ్చ (గ్రీన్) రంగులో, పంట దెబ్బతిన్నట్లు గుర్తిస్తే రంగు మారడం ద్వారా పరిస్థితిని తెలుసుకోవచ్చని వివరించారు. శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలు కూడా యాప్‌కు అనుసంధానం అవుతాయని చెప్పారు.

రెడ్ అలర్ట్ వచ్చిన సర్వే నంబర్లను రైతు సేవా సహాయ కేంద్రాల సిబ్బంది తప్పనిసరిగా సందర్శించి, పంటల వాస్తవ పరిస్థితిని పరిశీలించి యాప్‌లో నమోదు చేయాలని మండల వ్యవసాయ అధికారి ఆదేశించారు.