మాదక ద్రవ్యాలకు దూరం ఆరోగ్యకరమైన సమాజం
పుట్టపర్తిలో అవగాహన ర్యాలీ, మానవహారం
డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ
పుట్టపర్తి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గోవింద్ నాయక్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తి ఆరోగ్యాన్ని, కుటుంబ సంతోషాన్ని, సమాజంలోని శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద పట్టణ ప్రజలతో మానవహారం ఏర్పాటు చేసి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గోవింద్ నాయక్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు హరికృష్ణ, పవన్ కుమార్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ యువరాజు, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉమా మనోహర్ రాజు, నరసింహులు, ఓం సింగ్, ఈగల్ టీం సబ్ ఇన్‌స్పెక్టర్ హరి తదితర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
