ఆర్టీసీ బస్సులో జాయింట్ కలెక్టర్

ఆర్టీసీ బస్సులో జాయింట్ కలెక్టర్
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ వినూత్నంగా ముందడుగు వేశారు. ‘నో వెహికల్ డే’ను పాటిస్తూ సోమవారం ఆయన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కలెక్టరేట్‌కు ప్రయాణించి ఆదర్శంగా నిలిచారు. పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించిన జాయింట్ కలెక్టర్, అనంతరం నేరుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీగ్రీఎస్) హాల్‌కు చేరుకుని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ప్రధాని Narendra Modi, ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఇచ్చిన ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒకరోజు సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణా వినియోగం పెరగడం ద్వారా ఇంధన వనరులు ఆదా కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారి స్వయంగా బస్సులో ప్రయాణిస్తూ ప్రజలకు సందేశం ఇవ్వడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. జిల్లాలో ఇలాంటి చర్యలు ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
