భారతీ సిమెంట్‌లో ఉద్రిక్తత..
- పారిశ్రామిక శాంతి పునరుద్ధరించాలని విజ్ఞప్తి
- కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణ..
- అధికారుల జోక్యం కోరిన సంస్థ
కడప, ఆంధ్రప్రభ : వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తన ప్లాంట్, గనుల కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ, పారిశ్రామిక శాంతిని తక్షణమే పునరుద్ధరించాలని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులను కోరింది.
ఫ్రాన్స్‌కు చెందిన వికత్ (VICAT) గ్రూప్ అనుబంధ సంస్థ అయిన భారతీ సిమెంట్.. గత 17 ఏళ్లుగా కడప జిల్లాలో 5 ఎంఎటీపీఏ సామర్థ్యంతో కూడిన సమీకృత సిమెంట్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ, 12 వేలకుపైగా కుటుంబాల జీవనోపాధికి తోడ్పడుతున్నట్లు పేర్కొంది.
సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కొందరు కాంట్రాక్ట్ కార్మికులు, వారికి మద్దతుగా ఉన్న బాహ్య వ్యక్తులు ఆగస్టు 4న మైనింగ్ ప్రాంతంలోకి అనధికారికంగా ప్రవేశించి, మైనింగ్, ప్లాంట్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ప్రవేశ మార్గాల వద్ద నిలిపివేయడంతో మైనింగ్ పనులు నిలిచిపోయాయని, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రవాణా సిబ్బందిలో భద్రతా ఆందోళనలు నెలకొన్నాయని తెలిపింది.
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసినట్లు భారతీ సిమెంట్ వెల్లడించింది. కొందరు స్వప్రయోజనాల కోసం కాంట్రాక్ట్ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థ ఆరోపించింది. అన్ని సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శక చర్చల ద్వారానే పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
పరిశ్రమ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, శాంతిభద్రతల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీ సిమెంట్ విజ్ఞప్తి చేసింది.


