ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట

ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట
- మంత్రి సత్య కుమార్ యాదవ్
- 70 మంది లబ్ధిదారులకు రూ.46.14 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
- రెండేళ్లలో ధర్మవరం నియోజకవర్గానికి రూ.9.65 కోట్ల వైద్య సహాయం
ధర్మవరం, ఆంధ్రప్రభ : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం వారి పక్కనే నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తూ, ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం 70 మంది లబ్ధిదారులకు రూ.46,14,337 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షేమం అంటే కేవలం మాటలు కాదని, అవసర సమయంలో ప్రజలకు అండగా నిలవడమే నిజమైన సంక్షేమ పాలన అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య ఖర్చులతో కుటుంబాలు కుంగిపోకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ధర్మవరం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు తరచూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవలే పది రోజుల క్రితం దాదాపు రూ.30 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశామని, ఇప్పుడు మళ్లీ రూ.46 లక్షలకు పైగా సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. జూన్ 12 నాటికి తమ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ధర్మవరం నియోజకవర్గంలోని 913 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.9.65 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల ద్వారా అందించినట్లు వెల్లడించారు.
ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర శస్త్రచికిత్సలు, ఇతర వైద్య అవసరాల కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న వైద్య ఖర్చుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల సహాయం అందిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటిపై వేగంగా స్పందించే విధానాన్నే ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మండలాల వారీగా అర్హులను గుర్తించి సహాయం అందిస్తున్నామని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స కోసం మార్గం కనిపించని సమయంలో ప్రభుత్వ సహాయం తమ కుటుంబాలకు పెద్ద అండగా నిలిచిందని పేర్కొన్నారు. కొంతమంది లబ్ధిదారులు భావోద్వేగానికి గురవుతూ, సరైన సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం తమకు కొత్త జీవితం ఇచ్చినట్టైందని ఆనందం వ్యక్తం చేశారు.
