తహసీల్దార్ కార్యాలయానికి కొత్త భవనం దిశగా అడుగులు

నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ వడాల రాములు

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలో నూతనంగా నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వడాల రాములు గురువారం పరిశీలించారు.

భవన నిర్మాణానికి అనువైన స్థలంపై అధికారులతో చర్చించిన అదనపు కలెక్టర్, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆచార్య జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, డిప్యూటీ తహసీల్దార్ మాధవి, ఆర్‌ఐ భూమన్న, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.