తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు వేగం పెంచాలి

  • కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కలిసిన ఎంపీ మద్దిల గురుమూర్తి
  • నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుపతి జిల్లాలో ప్రతిపాదిత జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణ పనులను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇటీవల పార్లమెంట్ జీరో అవర్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం వల్ల తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యకు దూరమవుతున్నారని వివరించారు.

గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని ఎంపీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఈ విద్యాసంస్థ ఏర్పాటైతే వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

జవహర్ నవోదయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపును త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర అధికారులను ఎంపీ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు, తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎంపీ మద్దిల గురుమూర్తి వెల్లడించారు.